02/06/2021
తెలుగులో జానపద సాహిత్యం మీద జరిగినంత పరిశోధన, పరిశీలన, జానపద కళల మీద జరగలేదు. డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు తెలుగు వారి జానపద కళారూపాలు' అనే బృహత్ గ్రంథాన్ని రచించినా ఇంకా చెప్పవలసింది చాలా ఉందనే అభిప్రాయంతో డాక్టర్ గుమ్మ సాంబశివరావు రావు గారు ‘తెలుగు జానపద ప్రదర్శన కళారంగం' అనే గ్రంథాన్ని రచించారు. శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్ వారు 446 పేజీలతో ఈ గ్రంథాన్ని ప్రచురించారు. గుమ్మావారు ఈ గ్రంథాన్ని 16 శీర్షికలుగా విభజించి రచించారు. ‘జానపద ప్రదర్శన కళారంగం' అనే శీర్షికలో జానపద కళల వర్గీకరణ, ఇంత తెలుగు వరకు జరిగిన పరిశోధన మొదలైన అంశాల్ని వివరించారు. అనుకరణ నృత్యాలు, బొమ్మలాటలు, వీధినాటకాలు, పగటివేషాల్ని ఈ పుస్తకంలో విస్తృతంగా పరిచయం చేశారు. వివిధ రకాలైన కలాపాలు, ఒగ్గు కంజర, పంబ, బుర్ర కథ, ఆద్భుత విద్యలు, యాచకులు, ఉత్సవ సమయాల్లోని ప్రదర్శనలు, సుద్దులు మొదలైన వాటిని వివరించారు. తెలుగువారి జానపద కళలకు సంబంధించిన శాస్త్రీయ విశ్లేషణ, వివరణ ఈ గ్రంథంలో ఉంది. ఎన్నో ప్రాంతాల్లో పర్యటించి, ఎంతోమందిని సంప్రదించి, మరెన్నో గ్రంథాన్ని పరామర్శించి రూపొందించిన ఈ గ్రంథం పఠనీయమైన శైలిలో ఉంది. ఆయా కళారూపాలకు సంబంధించిన ఛాయా చిత్రాల్ని కూడా సందర్భోచితంగా చేర్చటం ఈ గ్రంథానికి మరింత శోభను కలిగిస్తున్నది. తెలుగువారి జానపద కళలకు సంబంధించిన ఒక మినీ విజ్ఞాన సర్వస్వం 'తెలుగు జానపద ప్రదర్శన కళారంగం.’ విజయవాడకు చెందిన శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. వెల రూ.400. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాల్లో ఈ పుస్తకం లభిస్తుంది. లేదా పుస్తకాల కోసం సంప్రదించండి : (ఆంధ్ర) 94948 75959, 94938 75959, 94928 75959 (తెలంగాణ) :90324 28516, 9160061944. పై నంబర్లకు ఫోన్ చేసి వివరాలు చెబితే పోస్ట్ ద్వారా నేరుగా పుస్తకాన్ని మీకు పంపిస్తారు. డాక్టర్ కప్పగంతు రామకృష్ణ